Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Sabbani Sahitya Vyasamulu (Telugu)
Sabbani Sahitya Vyasamulu (Telugu)
Sabbani Sahitya Vyasamulu (Telugu)
Ebook426 pages2 hours

Sabbani Sahitya Vyasamulu (Telugu)

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

ఒక పదేండ్ల క్రింద రావలసిన పుస్తకం ఇది.  ఇందులోని వ్యాసాల్లో సగం దశాబ్ధం క్రిందటనే రాసినవి. ఇటీవల నాలుగైదు నెలల నుండి రాసినవి మరి సగం. ఈ పుస్తకం తీసుకరావడానికి అక్టోబర్ 2022 నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను,రాస్తూనే ఉన్నాను. రాస్తున్న కొద్దీ రచనల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇలా ఈ 2023 జనవరి చివరి వారంలో ముద్రణకు వెళ్తుంది. కాలం చా

LanguageTelugu
Release dateMay 4, 2023
ISBN9788196087661
Sabbani Sahitya Vyasamulu (Telugu)

Related to Sabbani Sahitya Vyasamulu (Telugu)

Related ebooks

Reviews for Sabbani Sahitya Vyasamulu (Telugu)

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Sabbani Sahitya Vyasamulu (Telugu) - Sabbani Laxminarayana

    సాహిత్య సమైక్యతను చాటే సహృదయ సాహిత్యం

    A person sitting at a desk Description automatically generated

    ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

    తెలుగు శాఖ అధ్యక్షులు,

    స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,

    యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్,

    హైదరాబాద్-500 046

    ఫోన్: 9182685231

    డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ గారు ప్రముఖ కవి, పరిశోధకులు, అన్నింటికీ మించి సహృదయ సాహితీవేత్త. ఆయన స్వచ్ఛమైన ప్రేమతో మాట్లాడతారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో డిగ్రీలు చేశారు. మంచి పాండిత్యాన్ని సంపాదించారు. ఆ బహు భాషా పాండిత్యం ఈయన ప్రచురించబోతున్న ‘సబ్బని సాహిత్య వ్యాసములు’ లో ప్రస్పుటంగా  కనిపిస్తుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతీయభేదాలు లేకుండా సాహిత్యాన్ని మాత్రమే ప్రేమించే వ్యాసాల పుస్తకమిది. దీనిలో సుమారు 24 వ్యాసాలున్నాయి. గురజాడ మొదలుగా కందుకూరి, గిడుగు, కాళ్ళకూరి, విశ్వనాథ, జాషువా, శ్రీశ్రీ, తిలక్, కుందుర్తి, కాళోజీ, సోమసుందర్, దాశరథి, ఆరుద్ర, శేషేంద్ర, సినారె, వడ్డెర చండీదాస్, అలిశెట్టి ప్రభాకర్, ద్వానాశాస్త్రి, కె.శివారెడ్డి, ఎన్.గోపి, రాచపాళెం, బి.యస్.రాములు, రాధేయ, ఏనుగు నరసింహారెడ్డి మొదలైన వారి జీవితం, సాహిత్యాలను సమన్వయిస్తూ రాసిన వ్యాసాలివి. ఈ పేర్లు చూస్తే అన్నీ ఆధునిక సాహిత్యానికి చెందిన వ్యాసాలని స్పష్టంగానే అర్థమవుతుంది. కానీ, ఈ వ్యాసాల్లో వచన కవిత్వం,  దీర్ఘకవిత్వం, మినీకవిత్వం, రుబాయిలు,  కథలు, నవలలు, నాటకాలు వంటి ప్రక్రియలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. దీనితో పాటు వివిధ భావజాలాలు ఉన్నాయి. ఆ యా ప్రక్రియల్లో ఆ కవులు, ఆ పుస్తకాల స్థానాలను నిర్ణయించే ప్రయత్నం కూడా ఈ వ్యాసాల్లో కనిపిస్తుంది.

    గురజాడ అప్పారావు గారి 150వ జయంతి సందర్భంగా నివాళి వ్యాసంగా రాసినప్పటికీ ఆ వ్యాసంలో గురజాడ వారి పరిచయంతో పాటు, ఆయన ఆధునిక సాహిత్యానికి యుగకర్త ఎలా అవుతారో చక్కగా వివరించారు. కందుకూరి వీరేశలింగం గారి శ్రీ రాజశేఖరచరిత్ర గురించి ఒక చక్కటి తలనాత్మక విమర్శన వ్యాసాన్ని రాశారు.  ఆంగ్లంలో ఆలివర్ గోల్డ్ స్మిత్ రచించిన 'ది వికారాఫ్ ది వేక్ ఫీల్డ్' నిజానికి ఒక పెద్ద నవల. ఆ భాష కూడా ఇప్పుడు అంత సులభంగా కొరుకుడు పడదు. కానీ, ఆ కథను ఎంతో సులభంగా పాఠకులు అర్థం చేసుకునే విధంగా లక్ష్మీనారాయణ గారు వివరించారు. ఈ నవలపై ఇంతకుముందు కూడా అనేకమైన చర్చలు జరిగాయి. దీన్ని తొలి తెలుగు నవలగా అంగీకరించిన వారు కొందరైతే, తొలి తెలుగు నవలగా నరహరి గోపాలకృష్ణమ శెట్టి గారి 'సోనాబాయి పరిణయం' అనే మరో పేరు కలిగిన శ్రీరంగ రాజచరిత్రను చెబుతారు. దీనికి కారణం ఈ పుస్తకంలోనే రచయిత నవల అనే పారిపక్షిక పదాన్ని ప్రయోగించటం. కందుకూరి వారు నవల అనే బదులు ప్రబంధము అని పిలిచారు. ఇంతకుముందే ఈ మూడు నవలల్లో గల ఇతివృత్తాన్ని తులనాత్మకంగా  పరిశీలించిన వ్యాసాలు కూడా వచ్చాయి. వీటన్నింటిలో  ఆచార్య కొత్తపల్లి వీరభద్ర రావు గారు తన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యముపై ఇంగ్లీషు ప్రభావము’లో పేర్కొన్న అంశాలు ఎంతో మౌలికమైనవి. మరలా కందుకూరి వారి  రాజశేఖరచరిత్ర పై  అంత చక్కని మౌలికమైన విషయాలతో వచ్చిన వ్యాసం సబ్బని లక్ష్మీనారాయణ గారిదే. ఒక ఇల్లు కట్టడానికి నమూనా తీసుకున్నట్లుగా ఆంగ్లనవలను తన తెలుగు నవలకు ఒక నమూనాగా స్వీకరించారని రచయిత లక్ష్మీనారాయణ గారు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే మరొక విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. వివేక చంద్రికా విమర్శనం పేరుతో కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రిగారు వెలువరించిన విమర్శ ఎంతో విలువైంది. ఈ విమర్శ చదివిన తర్వాత కందుకూరి వారు తన నవల అనుసరణ అని ఒప్పుకున్నారు. ఇవన్నీ ఎందుకంటే సబ్బని లక్ష్మీనారాయణ గారు ఒక విలువైన వ్యాసాన్ని రాశారని చెప్పడానికే!

    తెలుగు వారికి ప్రాత:స్మరణీయులుగా గిడుగు రామమూర్తిగారిని అభివర్ణించడంలో సబ్బని కొండను అద్దంలో చూసినట్లు ఆ వ్యాసాన్ని రాశారు.

    వరవిక్రయం నాటకాన్ని కాళ్ళకూరి నారాయణరావుగారు నూరు సంవత్సరాలు క్రితం రాసినప్పటికీ, నేటికీ ఆ పరిస్థితి మారకపోవడాన్ని వివరిస్తూనే, నాటకంలో సందర్భానుసారంగా వర్ణించిన పద్యాలు కూడా కొన్నింటిని తన వ్యాసంలో పేర్కొన్నారు. ఈ పద్యాలు చదువుతుంటే  ఆ నాటకాన్ని పాఠకులకు చదవాలనిపిస్తుంది. నిజమైన సమీక్షగానీ, విమర్శగానీ చేయవలసిన ప్రభావాల్లో మూల రచనను చదివించేలా ప్రేరేపించగలగాలి. ఈ వ్యాసం మాత్రమే కాదు, దీనిలోని చాలా వ్యాసాలు ఇలా మూల రచనలను చదివించేలే ప్రేరేపిస్తాయి. ఈ పుస్తకంలో అందరూ చదవాల్సిన ఒక వ్యాసం ... విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన ‘మ్రోయుతుమ్మెద’ నవలపై రచించిన వ్యాసం. ఒక వ్యాసాన్ని ఎలా రాయాలో చెప్పడానికి మోడల్ గా ఈ వ్యాసాన్ని అభివర్ణించవచ్చు. కరీంనగర్ కు సమీపంలో ఉన్న ఒక నదిపేరు మ్రోయుతుమ్మెద.  తుమ్మెద అనగానే  ఒక  లయాత్మకమైన సంగీతం గుర్తొస్తుంది. నదిలా ప్రవహించిన ఒక హిందూస్తానీ  సంగీతకారుడు పి.నారాయణరావుగారి గురించి రాసిన నవల మ్రోయుతుమ్మెద. ఆ నాటి సామాజిక జీవితాన్ని నవల ప్రతిఫలిస్తుందని నిరూపించారు.  విశ్వనాథ వారి గురించి రాసిన వెంటనే  గుర్రం జాషువాగారి కవిత్వ సౌందర్యాన్ని వివరించే వ్యాసాన్ని పెట్టారు. జాషువాగారి ఆణిముత్యాల్లాంటి పద్యాల్నిఉటంకిస్తూ ఆయన కవిత్వ రసప్రవాహాన్ని చక్కగా వివరించారు. శ్రీశ్రీ గురించి రాస్తూ అనేక ఆయన కవితలను కొటేషన్లుగా వాడుకోవచ్చనీ, ఒక చక్కని లయాత్మకత ఉంటుందనీ పరిచయం చేశారు. ప్రతి వ్యాసం ఆలోచనాత్మకంగా ఉంటూనే మధ్యమధ్యలో ఉదాహరించిన కవితలు పాఠకులకు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి.

    ఇలా  వ్యాస సంపుటిలో కవి జీవిత సమన్వయ విమర్శన వ్యాసాలు ఉన్నాయి. కవి లేదా రచయితను పరిచయం చేసి ఒకటి లేదా రెండు రచనలను వారి జీవితంతో, ఆ సాహిత్యంతో సమన్వయం చేస్తూ కొనసాగిన వ్యాసాలు ఈ పుస్తకంలో కనిపించే ఒక ప్రత్యేకత. దీనివల్ల కవి గురించి తెలుసుకుంటాం. ఆ రచన  గురించి తెలుసుకుంటాం. ఆ కవి లేదా రచయిత రచనను పరిచయం చేసుకోవడం వల్ల ఇతర రచనలన్నీ  చదవాలనే ఒక గొప్ప ప్రేరణ కలుగుతుంది. కందుకూరి వారి భాషను వ్యాఖ్యానిస్తూ సబ్బని వారు అది ఆనాటికి వ్యావహారిక భాషగానే భావించవచ్చునని చెప్పడం ఒక గొప్ప పరిశీలన. ఈ రచయిత శైలి కూడా వ్యావహారికంగా, సరళ గ్రాంథికం కలగలిసిన వాక్యాలు కనిపిస్తాయి. మూల గ్రంథాలలోని భావాలను యథాతధంగా మనకు అందించడం వలన ఆ మూల గ్రంథాన్ని చదివిన అనుభూతి కలుగుతుంది.‌ ఆ తర్వాత ఆయన ఏమిరాశారనే ఉత్సుకతతో మూల గ్రంథాన్ని చదవాలనే ప్రేరణా కలుగుతుంది. 

    ఈ వ్యాసాలన్నీ సాహిత్య చరిత్రకు ఉపయోగపడతాయి. తెలుగు భాషాసాహిత్యాల ద్వారా తెలుగు వారి సమైక్యతను చాటడానికి దోహదం చేస్తాయి. ఒక పరిశోధన, ఒక విమర్శ, ఒక సమీక్ష, ఒక లోతైన భావజాల విశ్లేషణా ఈ వ్యాసాల్లో కనిపిస్తుంది. ఈ వ్యాసాలన్నీ పోటీపరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. దీని ద్వారా సబ్బని లక్ష్మీనారాయణగారిలో ఉన్న విశ్లేషణాశక్తి తెలుస్తుంది. ఆయన లోతైన విశ్లేషణతో పాటు తెలుగు కవులు, రచయితలను ప్రాంతాలకు అతీతంగా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పేలా ఈ వ్యాసాలు వెలువడ్డాయి. అయితే, తొలి నవల, తొలి దళిత కవి వంటి నిర్ణయాలను పోటీపరీక్షలకు వెళ్ళేవారు వాటిని లోతుగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి. ఇంత మంచి వ్యాసాల సంపుటిని నేటి నిజం పత్రిక సంపాదకులు, నిరంతరం తన పత్రిక ద్వారా సాహిత్య సేవ చేస్తున్న బైస దేవదాసుగార్కి అంకితం ఇవ్వడం ఎంతో సముచితంగా ఉంది.

    సబ్బని లక్ష్మీనారాయణగారు వయసులోను, జ్ఞానంలోను నాకంటే ఎంతో పెద్దవారు. నాచేత నాలుగు మాటలు రాయించడమనేది నాకు ఆయన ఇచ్చిన గొప్పగౌరవంగా భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరలా ఉభయ రాష్ట్రాలకు చెందిన కవులు, రచయితలు, వారి రచనలను ఒకే పుస్తకంలో చదువుతుంటే ప్రాంతాలు వేరైనా మా తెలుగు భాష ఒక్కటేనని చాటడానికి ఈ పుస్తకం ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. ఈ వ్యాససంపుటి రచయిత సబ్బని లక్ష్మీనారాయణగార్కి, అంకితం తీసుకుంటున్న బైస దేవదాస్ గార్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

    రెండు మాటలు

    ఒక పదేండ్ల క్రింద రావలసిన పుస్తకం ఇది.  ఇందులోని వ్యాసాల్లో సగం దశాబ్ధం క్రిందటనే రాసినవి. ఇటీవల నాలుగైదు నెలల నుండి రాసినవి మరి సగం. ఈ పుస్తకం తీసుకరావడానికి అక్టోబర్ 2022 నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, రాస్తూనే ఉన్నాను. రాస్తున్న కొద్దీ  రచనల  సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇలా ఈ 2023 జనవరి చివరి వారంలో ముద్రణకు వెళ్తుంది. కాలం చాలా గొప్పది!  కొన్ని మంచి రచనలు చదువుకునే భాగ్యాన్ని అవకాశాన్ని కూడా ఇచ్చింది. అలా యాదృచ్ఛికంగా రాసిందే విశ్వనాథ వారి ‘మ్రోయు తుమ్మెద'. అది మా కరీంనగర్ పట్టణానికి చెందిన గొప్ప సంగీతకారుడు  పి.నారాయణరావు గారిపై విశ్వనాథవారు రాసిన మహత్తర నవల. శిథిలమైన దశలో ఉన్న ఆ నవలను మిత్రుడు సంకేపల్లి నాగేంద్రశర్మ ద్వారా సాహితీమిత్రులు జి.వి. కృష్ణమూర్తి గారి ఇంటి నుండి సంపాదించి, చదివి వ్యాసం వ్రాసాను. ఆ నవలపై ఎంతో తృప్తి కలిగింది ఆ వ్యాసం రాసినందులకు కరీంనగర్ గడ్డపై పుట్టినవాడిని కనుక.  గురజాడ 150వ జయంతికి విజయనగరం వెళ్లి వచ్చాను, గురజాడ ఇంటిని దర్శించి వచ్చాను. ఆ సందర్భంగా రాసిందే గురజాడ పై వ్యాసం.  రాజమండ్రి వెళితే కందుకూరి ఇంటిని సందర్శించిన అనుభూతి గొప్పది. ఆ మహానుభావుడి సంపూర్ణ సాహిత్యం మా యింటి లైబ్రరీలో ఉంది. ఒక్క 'రాజశేఖర చరిత్రం' మళ్ళీ చదివి  వ్రాసాను.  గిడుగు వారి వ్యవహారిక భాషా సేవ, ఉద్యమం గొప్పది.  వారిపై వ్యాసం ఉంటే బాగుంటుంది అని వ్రాసాను. కాళ్ళకూరి నారాయణరావు గారి 'వర విక్రయం'పై ముప్పయి యేండ్ల కింద వ్యాసం రాసి పెట్టుకున్నాను.  శిథిలమైపోతున్న కాగితాల్లోంచి వ్యాసాన్ని సవరించి వేశాను. జాషువా కవిత్వమంటే ఎంత ప్రేమ నాకు!  జాషువాపై రాసి ఒక పుస్తకం వెయ్యొచ్చు. శ్రీశ్రీ, తిలక్ కవిత్వమంటే తొలి రోజుల్లోంచి చాలా ఇష్టం నాకు. శ్రీశ్రీ 'మహాప్రస్థానం'పై విస్తృతంగా తృప్తిమీర రాసాను. తిలక్ 'అమృతం కురిసిన రాత్రి'పై మమకారంతో రాసాను.

    మహాకవి శేషేంద్ర అంటే అభిమానంతో వారిపై 2007లో వారి సంస్కరణగా ఒక పుస్తకం కూడా వేసాను, ఇంకా కొన్ని వ్యాసాలు కలిపి. వారిపై కాళోజి ఆత్మ తెలంగాణే కదా! కాళోజీపై పుస్తకం వేసేంత సరుకు, వ్యాసాలు ఉన్నాయి నా దగ్గర, పుస్తకం నిడివి దృష్ట్యా ఈ పుస్తకంలో ఒక్క వ్యాసం మాత్రమే పొందుపరిచాను. మలిదశ తెలంగాణ ఉద్యమ కాలం 2013లో దాశరథి ఒకే ఒక్క కవిత 'తెలంగాణం' పై విశ్లేషణ చేస్తూ వ్యాసం వ్రాసాను. నేను తెలుగు భాషా ప్రేమికున్ని, తెలంగాణ గడ్డపై పుట్టినందుకు తెలంగాణ ప్రేమికున్ని కూడా. శతాబ్ధాలుగా, దశాబ్ధాలుగా దగాపడ్డ తెలంగాణను చదువుకొని  మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ  రాష్ట్ర ఆవశ్యకతను కోరి 12 పుస్తకాలు వెలువరించిన ఒకే ఒక్క తెలంగాణ రచయితని అని సగర్వంగా చెప్పుకుంటాను. నాటి నుండి నేటివరకు తెలంగాణ కావ్యవస్తువే కవులకు. అందుకే  ప్రేమతో  కుందుర్తి 'తెలంగాణ' పై, సోమసుందర్ 'వజ్రాయుధం' పై,  ఆరుద్ర  'త్వమేవాహం' పై ఇష్టపడి వ్యాసాలు వ్రాసాను.    కుందుర్తి 'తెలంగాణ' కావ్య ప్రతి అందుబాటులో లేకుండా పోయింది.  అదృష్ట వశాత్తు యూట్యూబ్ ద్వారా డా॥ నందిని సిధారెడ్డి గారు కుందుర్తి 'తెలంగాణ' కావ్యగానం చేసారు. ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా విని వ్రాసుకొని వ్యాసాన్ని రాసాను కుందుర్తి తెలంగాణపై.  సిధారెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాలి.  జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా॥ సి. నారాయణరెడ్డి గారు మా కరీంనగర్ జిల్లాకు చెందినవారు, వారి 'విశ్వంభర' తత్త్వాన్ని విశ్లేషిస్తూ వ్యాసం రాసినాను. కీ.శే. యువకవి అలిశెట్టి ప్రభాకర్ 1993 జనవరి తర్వాత మరణించినప్పుడు వ్యాసం వ్రాసాను 'అక్షరశిల్పి అలిశెట్టి' అని!  ఇప్పటికీ  ముప్పయి యేండ్ల క్రితం  అదే నేను వ్రాసిన తొలి వ్యాసం. ద్వా.నా.శాస్త్రి గారు పత్రికల్లో నేను వ్రాస్తున్న వ్యాసాలు చూసి 'లక్ష్మినారాయణా, నా పుస్తకంపై వ్రాయి అని పంపారు.  'తొలి దళిత కవి! కుసుమ ధర్మన్న', అని  అలా వారి పుస్తకంపై  రాసాను. చండీదాస్ నవలలు 'హిమజ్వాల' 'అనుక్షణికం' అంటే ఇష్టం! వారిపై వ్యాసం రాసాను.  ప్రసిద్ధ కవి గోపి గారి ప్రసిద్ధ కావ్యం 'జలగీతం'పై వ్రాసాను. యువ కవులకు పెద్దన్నయ్య కె.శివారెడ్డి గారి 'మోహనా! ఓ మోహనా!' పై వ్రాసాను. మా పాత కరీంనగర్ జిల్లా మరో ప్రసిద్ధ రచయిత బి.యస్. రాములు గారి 'బతుకుపోరు' నవలపై వ్రాసాను. ఇటీవల రాసినవి ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారి 'పొలి', అనంతపురం రాధేయ గారి 'మగ్గం బతుకు’ దీర్ఘ కావ్యాలపై.  ఈ వ్యాసాల్లో చివరగా ఉన్న వ్యాసం  డా॥ ఏనుగు నరసింహారెడ్డి గారి 'తెలంగాణ రుబాయిలు'.  వారు మా కరీంనగర్లో అదనపు కలెక్టర్ గా పనిచేసి పోయిన ఆత్మీయ మిత్రులు.  ఇందులో మొత్తం 24 వ్యాసాలున్నాయి. ఇందులో నవలలు, దీర్ఘకావ్యాలు, నాటకం, వచన కవితా సంపుటులు, మినీ కవితలు మొదలగు విషయాలపై వ్యాసాలున్నాయి. పుస్తకం వెయ్యడం ఒక యజ్ఞం లాంటిది. అందుకు కావలసిన సరుకు సరంజామా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. చదవడం, రాయడం పెద్ద పని!  ఓపిగ్గానే చదివాను, రాసాను, తొందర పడలేదు. మధ్యలో డిసెంబర్ నెలలో మద్రాస్, పాండిచ్చేరి, విజయవాడ, రాజమండ్రి వెళ్ళి వచ్చాను. ఇప్పటికి తయారు అవుతుంది పుస్తకం. ఈ జనవరి 2023 మాసంలోనే కస్తూరి విజయం వారి, పామిరెడ్డి సుధీర్ రెడ్డి గారు పరిచయం అయ్యారు. వారి ప్రచురణ సంస్థ ద్వారా ‘ప్రింట్ ఆన్ డిమాండ్’ బుక్ గా ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి రాబోతుంది ఈ పుస్తకం. వారికి కృతజ్ఞతలు. తొలుత పుస్తకం డిటిపి వర్క్ కవర్ పేజి డిజైన్ చేసిన మా కరీంనగర్ ‘హరీష్ కు’,  తర్వాత కస్తూరి విజయం తరపున బుక్ ప్రింటింగ్ మ్యాటర్ ప్రిపేరు చేసి ఇచ్చినందుకు  కస్తూరి  విజయం టీం మెంబర్లకు  నా కృతజ్ఞతలు . 

    కోరగానే ఆత్మీయంగా పుస్తకానికి పదిరోజుల్లోనే చక్కటి ముందుమాట అందించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

    ఈ పుస్తకంలోని సగానికిపైగా వ్యాసాలు 'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం

    అయినాయి.  ఆ పత్రిక ఎడిటర్ శ్రీ బైస దేవదాసు గారు, వారికి అభిమానపూర్వకంగా ఈ పుస్తకం

    అంకితం ఇవ్వడం జరుగుతుంది.

    పుస్తక ప్రచురణలో నాకు చేదోడువాదోడుగా ఉన్న మిత్రుడు సంకేపల్లి నాగేంద్ర శర్మకు, మా శారదకు, వంశీకి, శరత్ కు, కోడలు సృజనకు కృతజ్ఞతలు.  మా మనుమలు శ్రీయాన్, క్రితిన్ ల కు ఆశీస్సులు.

    తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో నాకు ఆత్మీయ మిత్రులున్నారు.  దేశంలోని వివిధ రాష్ట్రాలలోని మిత్రులతో కూడా పరిచయాలు ఉన్నాయి. అమెరికా, దక్షిణాఫ్రికా, మలేషియా లాంటి దేశాల్లో కూడా మిత్రులున్నారు.  నేడు తెలుగు ప్రపంచ భాష,  ఒకనాటికి ఇది అంతర్జాతీయ భాష కూడా అవుతుంది. అలా చేసే వాళ్ళు ఈ తెలుగు ప్రజలే!  ప్రపంచం నలుమూలల అన్ని దేశాల్లో మన తెలుగువాళ్లు ఉన్నారు. తెలుగు వర్ధిల్లుతుంది! నిలుస్తుంది! గెలుస్తుంది! అందుకు సాక్ష్యం ఈ పుస్తకంలోని కవులు, రచయితలే! ఒక గురజాడ, కందుకూరి, గిడుగు, కాళ్ళకూరి, విశ్వనాథ, జాషువ, శ్రీశ్రీ, తిలక్, కుందుర్తి, కాళోజీ, సోమసుందర్, దాశరథి, ఆరుద్ర, శేషేంద్ర, సినారె, చండీదాస్, ద్వా.నా. శాస్త్రి, అలిశెట్టి ప్రభాకర్ చిరస్మరణీయులు! నేటి కాలపు ప్రసిద్ధ రచయితలు కె. శివారెడ్డి, ఎన్. గోపి, రాచపాళెం, బి.ఎస్. రాములు, రాధేయ, ఏనుగు నరసింహారెడ్డి గార్లకు అభినందనలు.

    పై రచయితలందరు సాహితీ అమృతం పంచారు. వారి రచనల ద్వారా నేను దాన్ని పాఠకులకు కొంత పరిచయం చేస్తున్నాను. మంచి సాహిత్యం ఒక దివ్య ఔషధం మనిషికి. సాహిత్యమే, కవిత్వమే ప్రాణంగా బతికిన వాన్ని! స్వతహాగా సాహిత్య సృజన చేయడంతో పాటు నా కాలం రచయితలతో పాటు నాకన్న ముందున్న రచయితల రచనలపై కూడా అప్పుడప్పుడు నా అభీష్టం మేరకు రాస్తూ పోయాను. రాయడం ఒక సామాజిక బాధ్యత. స్వతహాగా కవిని కాని కవితతో పాటు నవల, వ్యాసం, సమీక్ష - విమర్శ, గేయం, పేరడి అనువాదం లాంటి ప్రక్రియల్లో కూడా రచనలు చేశాను.  నిజంగా ఇలాంటి వ్యాసాలు  రాయడంలో గొప్ప తృప్తి అనిపించింది. వారి వారి రచనా విధానం, వారి అభిరుచులు, ఆలోచనలు, శైలి గురించి తెలిపినవి. నిజంగా విశ్వనాథవారి 'మ్రోయు తుమ్మెద' పై వ్యాసం రాస్తుంటే విశ్వనాథ వారి రచనా శైలిలోనే రాయడం అలవడుతుందా అని అనిపించేది. మహానుభావులు, సాహితీ మూర్తులు పై వారందరు! వారి రచనలు చదివే భాగ్యం కలిగి నందులకు, వారిపై రాసినందుకు సంతోషిస్తున్నాను. ఇందులో గురజాడ నుండి నేటివరకు మూడు తరాలకు చెందిన రచయితల,కవుల రచనలు ఉన్నాయి తెలుగులో ఆణిముత్యాల్లాంటి మంచి రచనలు ఇంకా లేవని కాదు,  ఇప్పటికివి చాలు అని ఈ పుస్తకం వేస్తున్నాను. మలి ప్రయత్నంలో మరిన్ని ఆణిముత్యాల్లాంటి  రచనలతో, సాహితీ వ్యాసాలతో మీ ముందుకు వస్తానని సాదరంగా....

    తేది 27-1-2023

    సబ్బని లక్ష్మీనారాయణ

    ఇ.నెం.

    Enjoying the preview?
    Page 1 of 1